||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- నలుబది ఏడవ సర్గ||

||'చకార రక్షోధిపతేర్మహత్ భయమ్'!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ సప్తచత్త్వారింశస్సర్గః||

తత్త్వదీపిక
నలుబది ఏడవ సర్గ
'చకార రక్షోధిపతేర్మహత్ భయమ్'

" చకార రక్షోధిపతేర్మహత్ భయమ్"
అంటే ఆ రాక్షసాధిపతి మనస్సులో మహత్తరమైన భయము కలిగినదట.
నలభై ఆరవ సర్గలో రాక్షాధిపతి మనస్సులో సందేహాలు రేకెత్తిన మాట విన్నాము.
ఇప్పుడు సందేహాలు కాదు , భయము పుట్టినదట.
భయము ఎలాగ పుట్టినదో ఈ సర్గలో వింటాము.

పంచ సేనాపతులు వారి అనుచరులతో వాహనములతో హతమార్చబడిరని వినిన రావణుడు,
ఆ తన దృష్టిని సమరమునకు సుముఖుడైన తన కుమారుడు అక్షునివైపు సారిస్తాడు.
రావణుని చూపునే ఆదేశముగా గ్రహించిన అక్షుడు, మహాప్రతాపము కలవాడు.
అప్పుడు అక్షుడు బంగారు ధనస్సును ధరించినవాడై,
సదస్సులో వెలిగించబడిన హవిస్సులాగా లేచి నిలబడెను.

వీరుడు బాలదివాకురునివలె తేజము కలవాడుఅగు అక్షకుమారుడు,
మేలిమి బంగారపు జాలలతో విలసిల్లుతున్న రథమును ఎక్కి,
ఆ మహావానరుని ప్రతి యుద్ధమునకు బయలు దేరెను.

తపస్సుతో ఆర్జించబడిన మేలిమి బంగారపు జాలలతో శోభించుచున్న ఆ రథము ,
పతాకములతో రత్నములతో పొదగబడిన ధ్వజముతో గలది.
మనోవేగముతో పోగల ఆ రథము ఎనిమిది అశ్వములచేత లాగబడినది.

ఆ రథము సురాసురులకు దుష్కరమైనది.
నిరాటంకముగా పోగలగినది.
రవితేజముతో ఆకాశమార్గమున పోగలగినది.
బాణములుపెట్టుకొనే తూర్ణము, ఎనిమిది ఖడ్గములు, శక్తులు మున్నగునవి
ఆ రథములో సముచిత స్థానములలో అమరించబడినవి.

పరాక్రమములో అమరులతో సమానమైన ఆ అక్షకుమారుడు
అన్నిరకముల ఆయుధములతో నిండివున్న ,
దివ్యరథమును ఎక్కి యుద్ధమునకు బయలు దేరెను.

తురంగముల మాతంగముల మహారథముల ఘోషతో
భూమిని ఆకాశమును పర్వతరాజములను నింపుతో,
మహాసైన్యముతో ఆ సమర్థుడు
తోరణముపై ఉపస్థితుడైన అయిన వానరోత్తముని సమీపించెను.

ఆ సింహపు దృష్టి గల అక్షుడు,
యుగాంతములో ప్రజలను నశింపచేయు ప్రళయాగ్నివలె వున్న ఆ వానరుని సమీపించి,
గౌరవభావముతో అశ్చర్యసంతోషజనిత దృష్టితో హనుమంతుని చూడసాగెను.

మహాబలుడు రాజకుమారుడు మహాత్ముడు అగు అక్షుడు ఆ వానరుని వేగమును ,
శత్రువులమీద చూపగల బలమును, తన బలమును గురించి విచారించి,
మంచును నశింపచేయు సూర్యుని వలె భాసించెను.

యుద్ధములో ఎదుర్కొనబడలేని పరాక్రమము గల హనుమంతుని చూచి,
కోపము గలవాడై, మనస్సును స్థిరపరచుకొని,
హనుమంతునిపై సునిశితమైన మూడు బాణములను ఆహ్వానరూపముగా ప్రయోగించెను.
అప్పుడు ఆ అక్షుడు శత్రుపరాజయములచేత ఆర్జించిన గర్వము గల, శ్రమలేని ఆ వానరుని చూచి,
ధనస్సును బాణములను చేతబట్టి రణోత్సాహముతో తనమనస్సులో ఆలోచించెను.

పిమ్మట ప్రచండ పరాక్రమము గల,
బంగారు బాహుపురులు కుండలములను దాల్చిన ఆ రాజకుమారుడు
ఆ వానరోత్తమునితో సమరము చేయుటకై సిద్ధపడెను.
వారి అప్రతిమ సంగ్రామము సురులకు అసురులకు కూడా సంభ్రమము కలిగించెను.
ఆ హనుమంతుని అక్ష కుమారుని సమరము చూచి
భూమి దద్దరిల్లెను.
సూర్యుడు తపించుటలేదు.
వాయువు వీచుటలేదు.
అచలములు చలించినవి.
ఆకాశము సముద్రము క్షోభించినవి.

అక్షుడు లక్ష్యములకు మోక్షము కలిగించు వాడు.
సుముఖమైన బంగారు పిడులు కలవాడు.
ఆ వీరుడు అక్ష కుమారుడు బాణములను సంధించి గురిచూచి,
విషపూరితమైన మూడు బాణములను హనుమంతుని శిరస్సు పై ప్రయోగించెను.

ఒకే క్షణములో తలపై పడి, ఆ శరములతో కొట్టబడి ,
కారుచున్నరక్తధారలతో తడిసిన కళ్ళుకల ఆ వానరోత్తముడు,
ఆ శరములే కిరణముల లాగా కొత్తగా ఉదయించిన సూర్యుని వలె,
కిరణములే మాలలులాగ గల సూర్యునివలె విరాజిల్లెను.

అప్పుడు ఆ హనుమంతుడు,
వివిధమైన ఆయుధములతోనూ చిత్రమైన ధనస్సుతోనూ ఉన్న
ఆ రాజుయొక్క వరిష్ట పుత్రుని చూచి, యుద్ధమునకు తయారు అయ్యెను.

మందరపర్వతము పై కూర్చునినవాని వలె బలము వీర్యము కల హనుమంతుడు
మరింతపెరిగిన కోపము కల వాడై,
బలగముతో వాహనముతో వున్న ఆ అక్షకుమారుని
తనకళ్లలో ఉన్న అగ్నితో దహించివేయునా అన్నట్లు చూచెను.

అప్పుడు ఆ అక్షకుమారుడు ఆ బాణములతో నిండిన చిత్రమైన ధనస్సుతో
శరపరంపరను ఆ వానరోత్తమునిపై
నీటితో నిండిన మేఘములు సమున్నత పర్వతముపై
వర్షము కురిపించినట్లు కురిపించెను.

ఆ యుద్ధములో ప్రచండ విక్రమము గల అమిత పరాక్రమము గల వానరుడు
మేఘములతో సమానమైన పరాక్రమము గల ఆ అక్షుని చూచి ఆనందముతో గర్జించెను.

ఆ అక్షుడు బాలుని భావముతో గర్వముతో తన కళ్ళను ఎర్రచేస్తూ
గడ్డితో కప్పబడిన మహాకూపమును చూడకుండా పరుగెడుతున్న ఏనుగ వలె
రణములో అప్రతిమమైన వానరుని వైపు ముందుకుదూసుకు పోయెను

ఆ వానరుడు అక్షుని బాణములతో కొట్టబడి మహత్తరమైన నాదము చేసెను.
ఆ మారుతి భుజములు తొడలు చరుస్తూ ఘోరమైన రూపముతో ఆకాశములోకి ఎగిరెను.

బలముగల రాక్షసులలో ప్రవరుడు ప్రతాపము గలవాడు
రథములో ఉన్నవాడు రథికులలో శ్రేష్ఠుడు అయిన ఆ అక్షకుమారుడు
మేఘములు పర్వతముపై వర్షము కురిపించిన రీతి
తన బాణములను ప్రయోగించుచూ హనుమంతుని వెంటాడెను.

మనస్సుతో సమానమైన వేగముకల,
యుద్ధములో ప్రచండ విక్రమము కల ఆ హనుమంతుడు
వాయువు వలె తిరుగుతూ అతని బాణములను తప్పించుకుంటూ ఆకాశమున తిరిగెను.
ఆ మారుతాత్మజుడు రణోన్ముఖుడై ఒకే ధారగా నిశితమైన ఉత్తమమైన బాణములతో
ఆకాశము అంతా నింపుతున్న ఆ అక్షుని గౌరవభావముతో చూస్తూ ఆలోచింపసాగెను.

అప్పుడు మహాభుజములు కల విశేషకర్మల జ్ఞానముకల ఆ హనుమంతుడు
ఆ కుమారవీరునిచే గాయపడిన భుజాంతరముకలవాడై గర్జన చేయుచూ ఆలోచింపసాగెను.

' బాలదివాకరుని తేజస్సు కలవాడు అయిన ఈ బాలకుడు,
ఆరితేరిన వానివలె మహత్తరమైన యుద్ధము చేయుచున్నాడు.
యుద్ధకర్మలను అన్నింటితోనూ శోభిస్తున్న ఇతనిని
హతమార్చుటకు నాకు మనస్కరించుటలేదు'.

'ఇతడు మహాత్ముడు. వీరత్వములో మహాత్ముడు. యుద్ధములో సహనము వివేకము గలవాడు.
ఇతడు తన గుణములతో అసంశయముగా నాగులకు యక్షులకు దేవతలకు పూజనీయుడు'.

'పరాక్రమోత్సాహములతో పెరుగుతున్న మనసు కలవాడై
నాముందు నిలచి నన్ను ధైర్యముగా చూచుచున్నాడు.
శీఘ్రముగా చలనము కల ఈ ధీరుని పరాక్రమము
సురులు అసురుల మనస్సులో కూడా భీతి కలిగించును.
ఇతనిని ఉపేక్షించరాదు'.

'నన్నుఈ రణములో అతిక్రమించకపోయిననూ ఇతని పరాక్రమము వర్ధిల్లు చున్నది.
ఇప్పుడు ఇతనిని తుదముట్టించడమే మంచిదని నాకు తోచుచున్నది.
పెరుగుతున్న మంటలను ఉపేక్షించుట కూడని పని'.

వీరుడైన మహాబలుడు మహాకపి ఇలాగ అతనిపై ఆలోచించి,
తను చేయవలసిన కార్యమును నిశ్చయించుకొని వేగముగా ముందుకు సాగెను.
మనస్సులో అతనిని వధించుటకు హనుమంతుడు నిశ్చయించుకొనెను.

వీరుడు పవనాత్మజుడు అగు ఆ కపిసత్తముడు
వాయువు సంచరించు మార్గములో పోవు,
రథమును అతి వేగముగా తిప్పగల,
మహత్తరమైన భారములను మోయగల,
ఎనిమిది అశ్వములను, రథమును తన చేతితో కొట్టెను.
అప్పుడు చేతితో కొట్టబడిన, విరిగిన మహా రథముయొక్క కప్పు కూబరము ముక్కలు ముక్కలుగా అయి,
చనిపోయిన గుఱ్ఱములతో సహా రథము భూమి మీద పడిపోయెను.

ఆ రధమును పరిత్యజించి తన ధనస్సుతోనూ ఖడ్గముతోనూ ఆకాశములోకి ఎగిరిన అక్షుడు,
తపశ్శక్తితో దేహము వదిలి ఆకాశమార్గమున పోవు ఋషులవలె నుండెను.

అప్పుడు మారుతితో సమానమైన శక్తి కల వానరోత్తముడు
సిద్ధులు గరుత్మంతుడు వాయువునకు సంచారయోగ్యమైన
ఆకాశములో తిరుగుచున్న ఆ అక్షుని సమీపించి వాని పాదములు గట్టిగా పట్టుకొనెను.

ఇంద్రునితో సమానమైన పరాక్రమము గల వానరోత్తముడు అగు హనుమంతుడు
మహాసర్పమును గరుత్మంతుడు చేజిక్కుంచికొనినట్లు
ఆ అక్షకుమారుని పట్టుకొని వేయిసార్లు గిరగిరా తిప్పి భూమిపై పడవేసెను.

అప్పుడు ఆ అక్షకుమారుడు భగ్నమైన బాహువులు కలవాడై
తొడలు కటిప్రదేశము విరిగిపోయినవాడై,
ఎముకలు విరిగిపోయి కీళ్ళు ఊడిపోయి భూమిపై పడి
వాయుసుతుని చేత హతమార్చబడినవాడయ్యను.

ఆ మహాకపి అక్షుని భూమిమీద పడవేసి,
'చకార రక్షోధిపతేర్మహత్ భయమ్'
ఆ రాక్షసాధిపతి అయిన రావణునికి మహత్తరమైన భయము కలిగించెను.

అంటే సీతమ్మ దర్శనము అయి తిరుగు ముఖము పట్టబోతూ,
సామదాన బేద దండో పాయములలో దండో పాయము ఉపయోగించి,
"హతప్రవీరా హి రణే హి రాక్షసాః
కథంచి దీయుర్యది హాద్య మార్దవమ్|"
అంటే 'యుద్ధములో రాక్షసులను కొందరిని చంపినచో వారు మెత్తపడుదురు"
అని ఆలోచించిన హనుమ,
వాళ్ళని మెత్తపడునట్లు చేయడమే కాక,
ఆ రాక్షసాధిపతి కి భయము కూడా కలిగించి
తన కార్యము సాధించాడన్నమాట.

అదే హనుమంతుని ఘనత.

ఆకాశములో తిరుగు మహావ్రతములు చేయు మహర్షులు,
యక్షులు పన్నగులు సమస్త భూతములు,
ఇంద్రుడుతో కూడిన సురలు కూడా
ఆ వానరోత్తముడు ఆ కుమారుని హతమార్చడము చూచి ఎంతో ఆశ్చర్యచకితులైరిట.

ఇంద్రుని కొడుకుతో సమానమైన తేజస్సుకలవాడు
రక్తవర్ణనేత్రములు గలవాడు అయిన ఆ అక్షకుమారుని హతమార్చిన హనుమంతుడు
'కృతః క్షణః కాల ఇవా ప్రజాక్షయే"
అంటే ప్రళయకాలములో ప్రజలను అంతమొందించు కాలునివలె,
మళ్ళీ అశోకవన తోరణముపై ఎక్కి కూర్చొనెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభైఏడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||